Amaravathi City News :గోడపత్రిక ను ఆవిష్కరించిన మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్

Sharat
1 View

అమరావతి (19 సెప్టెంబర్ 2026):ప్రతి పాము కాటు ప్రాణాంతకం కాదని, అప్రమత్తతతో పాటు సత్వర వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలను సులభంగా కాపాడుకోవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ‘అంతర్జాతీయ పాముకాటు అవగాహన వారోత్సవాల’ సందర్భంగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శనివారం ప్రత్యేక గోడపత్రిక (పోస్టర్)ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు, నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.AMARAVATHI NEWS

అన్ని ఆసుపత్రుల్లో, 108 అంబులెన్సుల్లోనూ ‘యాంటీ వెనమ్’ గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న దాదాపు 3,500 పాము జాతుల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవని తెలిపారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా తాచు పాము, రక్త పింజర, కట్ల పాము వల్ల మాత్రమే ప్రాణాపాయం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటు విరుగుడు మందు (Anti Snake Venom – ASV) అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

వైద్య సేవలను బాధితులకు మరింత చేరువ చేసేందుకు 2026 జనవరి నుంచి 108 అంబులెన్సుల్లోనూ ఈ విరుగుడు మందును అందుబాటులోకి తెచ్చామని, అత్యవసర వైద్య సిబ్బంది ద్వారా ఇప్పటివరకు 9 మందికి అంబులెన్సులోనే తక్షణ చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలిగామని మంత్రి తెలిపారు.

తగ్గుతున్న మరణాలు.. గణాంకాలు ఇవే: రాష్ట్రంలో గడిచిన మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పాముకాటు మరణాలు గణనీయంగా తగ్గుతున్నాయని మంత్రి తెలిపారు:

  • 2024: 41 మరణాలు
  • 2025: 13 మరణాలు
  • 2026 (ఆగస్టు వరకు): 6 మరణాలు మాత్రమే.

కేసుల నమోదు వివరాలు:

  • సంవత్సరాల వారీగా: 2023లో 4,809, 2024లో 4,573, 2025లో 4,702 కేసులు నమోదవ్వగా.. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు 4,111 కేసులు నమోదయ్యాయి.
  • ఆగస్టు వరకు అత్యధిక కేసులు నమోదు: శ్రీకాకుళం జిల్లా (706) ప్రథమ స్థానంలో ఉండగా, పశ్చిమగోదావరి (369), విజయనగరం (307), కృష్ణా (296), ఏలూరు (271) జిల్లాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేసులు పెరుగుతూ రాగా.. జూలైలో 890, ఆగస్టులో 1,051 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ, తీరప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉన్నందున, అటవీ మరియు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

పుష్కలంగా విరుగుడు మందు నిల్వలు: రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రధాన వైద్య కేంద్రాల్లో సెప్టెంబర్ 18 నాటికి మొత్తం 2,807 మోతాదుల (డోసుల) ASV నిల్వ ఉంచినట్లు తెలిపారు. విజయనగరంలో 1,391, నెల్లూరులో 364, కృష్ణాలో 267, పశ్చిమగోదావరిలో 260, కర్నూలులో 213 డోసులు సిద్ధంగా ఉన్నాయి.

108 సిబ్బంది సమయస్ఫూర్తి – ఇద్దరి ప్రాణాలు కాపాడిన తీరు:

  1. కర్నూలు జిల్లా: ఓర్వకల్లు మండలానికి చెందిన చెన్నిబాయి (45) జూలై 18న పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. స్థానిక PHCలో మందు లేకపోవడంతో కర్నూలు తరలిస్తుండగా, 108 సిబ్బంది ఆమె లక్షణాలు (శ్వాస ఇబ్బంది, చూపు మసకబారడం, ఆక్సిజన్ స్థాయి 93%) గమనించి అంబులెన్సులోనే అత్యవసర చికిత్స మరియు విరుగుడు మందు అందించి ప్రాణాపాయం తప్పించారు.
  2. బాపట్ల జిల్లా: చీరాల మండలానికి చెందిన వెంకయ్య (40) నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురికాగా, వెంటనే 108 సిబ్బంది చేరుకుని బాధితుడి పరిస్థితిని అంచనా వేసి సకాలంలో ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బాధితులు క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.

చేయాల్సినవి.. చేయకూడనివి (వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు):

  • పాము కరిచినప్పుడు: బాధితుడిని ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంచాలి. కరిచిన భాగాన్ని కదలకుండా ఉంచి, గాజులు, ఉంగరాలు, కడియాలు వంటి బిగుతుగా ఉండే వస్తువులను వెంటనే తొలగించి ఆసుపత్రికి తరలించాలి.
  • చేయకూడని పనులు: కాటు వేసిన చోట గాయం చేయడం, నోటితో విషాన్ని పీల్చడం, తాడుతో గట్టిగా కట్టడం, మూలికా/సొంత వైద్యం చేయడం వంటివి చేయరాదు.
  • ముందస్తు జాగ్రత్తలు: రాత్రివేళల్లో నేలపై నిద్రించకూడదు. బయటకు వెళ్లేటప్పుడు టార్చ్ లైట్ ఉపయోగించడం, చెప్పులు ధరించడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం శ్రేయస్కరం. పాము కనిపిస్తే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకుండా గుర్తింపు పొందిన ‘స్నేక్ క్యాచర్స్’ సహాయం తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
Author
Share This Article
Leave a review