భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టడం జరుగుతున్నదని జిల్లా రెవెన్యు అధికారి ఎన్ ఎస్ కే.ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం కలక్టరేట్ లో ఎస్.ఆర్. శంకరన్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs) మరియు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROs) , బూత్ స్థాయి అధికారులు (BLOs), సూపర్‌వైజర్లు (BLO Supervisors) లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యు అధికారి ఎన్ ఎస్ కే.ఖాజావలి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీఆర్ఓ మాట్లాడుతూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు , అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఎన్నికల చట్టాలు, పారదర్శకత మరియు పర్యవేక్షణకు సంబంధించిన బాధ్యతలపై ఈ నెల 11 వ తేది జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా నేడు BLOs , BLO Supervisors లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు మరియు సూపర్‌వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) సమయంలో బీఎల్ ఓ ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కొత్త ఓటు నమోదు – ఫారం 6, తప్పుల సవరణ ఫారం-8 మరియు ఓటు తొలగింపు ఫారం -7 కొరకు దరఖాస్తులను స్వీకరించాలన్నారు. గ్రామం లేదా వార్డులో మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను గుర్తించి నివేదిక అందించాలన్నారు. ఎపిక్ కార్డులను నేరుగా సంబంధిత ఓటరుకు చేరవేయలన్నారు. బీఎల్ ఓ సూపర్‌వైజర్లు సాధారణంగా తమ పరిధిలోని 10 నుండి 12 మంది బీఎల్ ఓ ల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు. వీరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి, BLOలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నారు. బీఎల్ ఓ సమర్పించిన నివేదికలు, వారు సేకరించిన దరఖాస్తులు ఖచ్చితంగా ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో క్రాస్ వెరిఫికేషన్ చేస్తారన్నారు. అలాగే ఎన్నికల సంఘం జారీ చేసే కొత్త నిబంధనలు, బీఎల్ ఓ లకు తగిన సలహాలు, శిక్షణ ఇస్తారన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రగతిని మరియు సమస్యలను ఈ ఆర్ ఓ , ఏ ఈ ఆర్ ఓ లకు తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు , తెనాలి ఆర్ డి ఓ రమణి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి , ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు, బీఎల్ ఓ , బీ ఎల్ ఓ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.



