విజయవాడ, నవంబర్ 5:– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. గురువారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లతో నేరుగా మాట్లాడి పోలింగ్ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఓటర్లు, పోలింగ్ సిబ్బంది వెల్లడించడంతో ఎన్నికల కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిందని, రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని చెప్పారు. రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తరువాత బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తామని వివరించారు.
తాను సందర్శించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూమ్‌లలోనూ నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కృష్ణా జిల్లా ఎన్నికల పరిశీలకుడు వి. అభిషేక్‌తో కూడా ఎన్నికల సరళిపై చర్చించారు.Vijayawada City News
పోలింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ విజ్ఞప్తి చేశారు.



