Vijayawada City News : ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ-పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి – అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్

S Sarath
2 Views

విజయవాడ, అక్టోబర్ 23:- రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణలో ఎన్నికల విధివిధానాలు, పోలింగ్ నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

పోలింగ్ ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఓటర్ల గుర్తింపు ప్రక్రియ, బ్యాలెట్ పత్రాల నిర్వహణ, ఓటు వేసే విధానం, బ్యాలెట్ బాక్సుల వినియోగం తదితర అంశాలపై ప్రిసైడింగ్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అనుసరించాల్సిన విధివిధానాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.Vijayawada City News

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎదురయ్యే సందేహాలను శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన చర్యలను అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది శిక్షణ నోడల్ అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review